జీవించడమంటే జస్ట్ బ్రతికుండడమా?



మీరు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు: "ఇన్ని distractions మరియు పోలికలు ఉన్న ఈ ప్రపంచంలో, ఒక యువకుడు/యువతి తనకు నిజంగా ఏది ముఖ్యమో ఎలా తెలుసుకోవాలి? Inner clarity తో ఎలా ఉండాలి?"
వినడానికి ఈ ప్రశ్న చాలా అద్భుతంగా, ఆదర్శవంతంగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్న పునాదుల్లోనే ఒక పెద్ద అబద్ధం దాగి ఉంది. మీరు మిమ్మల్ని మీరు యువకులు అని పిలుచుకుంటున్నారు. మీరు మీ జీవితాన్ని సున్నా  నుండి, ఒక Clean slate నుండి ప్రారంభిస్తున్నారని మీరు బలంగా నమ్ముతున్నారు.

కానీ నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పుకోండి: మీకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు అయినా మీ మెదడు ఒక Clean slate లా ఉందా?

లేదు. ఎవరికీ ఉండదు. మనందరి సమస్య ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించడంలో చూపే ఉత్సాహం, మనం ప్రస్తుతం ఎక్కడ నిలబడి ఉన్నాము అని ప్రశ్నించుకోవడంలో చూపించము. ముందుకి వెళ్ళడానికి పద్నాలుగు దారులు ఉన్నాయి, ఏ దారి ఎంచుకోవాలి అని అడుగుతారు. కానీ, అసలు మీరు నిలబడిన ఆ చోటు, ఆ పునాది మీదేనా? ఆ పునాదిని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? బహుశా మీరు వేయాల్సిన అడుగు ముందుకి కాదు, మీ లోపలికి!

మీ వయసు 20 కాదు... 1000 సంవత్సరాలు!
మీరు భౌతికంగా యువకులే కావచ్చు, మీ చర్మం మీద ముడతలు లేకపోవచ్చు. కానీ మానసికంగా, మీరు ఎనభై ఏళ్ల వృద్ధురాలి కంటే ముసలివారు. ఎందుకంటే మీ మెదడులో కూర్చున్నది మీ నానమ్మ, లేదా మీ తాతయ్య.
దీన్ని నిరూపించమంటారా?
మీ జీవితంలో మీరు కోరుకునేది ఏమిటి? భద్రత (Security), నలుగురిలో గుర్తింపు, కొంత డబ్బు, ఒక ఇల్లు.

ఇప్పుడు చెప్పండి, మీ ముత్తాతలు, మీ నానమ్మలు కోరుకోని కొత్త కోరిక ఏమైనా మీలో ఉందా?
మీ నమ్మకాలు, దేవుడు, మతం, కులం, సమాజం గురించిన మీ అభిప్రాయాలు అన్నీ పాత తరాల వాళ్ళు మీ మెదడులోకి ఎక్కించినవే కదా?

మరి ఇంక మీలో యవ్వనం ఎక్కడ ఉంది? ఒక బిడ్డ పుట్టిన ఐదేళ్లకే, ఆ బిడ్డ మెదడులోకి సమాజం తన పాత చెత్తనంతా కుమ్మేస్తుంది. మీ అనుమతి లేకుండానే మీ మెదడులోకి వారి భయాలు, వారి నమ్మకాలు చొప్పించబడ్డాయి. ఇది ఒక మానసిక దాడి. మీరే ఎప్పుడూ దీనికి అంగీకరించలేదు, కానీ ఆ పాత ఆలోచనలన్నీ మీవి అని మీరు భ్రమపడుతున్నారు. మీరు ఏమీ కొత్తవాళ్ళు కారు, కేవలం గతానికి ఒక Recycled product మాత్రమే! పాత వస్తువుకి రంగులేసి ఇది కొత్తది అని చెబితే మీరు ఒప్పుకుంటారా? మరి మిమ్మల్ని మీరు ఎలా కొత్త వాళ్ళు అని అంగీకరిస్తున్నారు?

మనం మన ఎంపికల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటామో చూద్దాం. మీ హెయిర్‌కట్ మీదేనా? మీరు ఏమంటారు, "నా ముఖానికి ఏది సెట్ అవుతుందో నా స్టైలిస్ట్ ని అడిగి చేయించుకున్నాను" అని. కానీ ఆడవాళ్ళకి జుట్టు పొడవుగా ఉండాలి, మగవాళ్ళకి జుట్టు పొట్టిగా ఉండాలి అన్న ఈ కండిషనింగ్ ఎక్కడి నుండి వచ్చింది?
అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మగవాళ్ళు ఎందుకు పెదాలకు రంగు వేసుకోరు? ముక్కు, చెవులు, కిడ్నీల లాగానే పెదవులు కూడా ఇద్దరికీ ఒకేలా ఉంటాయి కదా? ఒక మనిషి కిడ్నీ లేదా రక్తం మరొకరికి పనికొస్తుంది, అందులో జెండర్ తేడా లేదు. మరి ఆడవాళ్ళు మాత్రమే పెదాలకు ఎందుకు రంగు పూసుకోవాలి? ఒకవేళ ఇక్కడ ఒక మగవాడు లిప్‌స్టిక్ వేసుకుని కూర్చుంటే, మీరు అతన్ని చూసి నవ్వుతారు, లేదా అసహ్యించుకుంటారు. ఎందుకు?
ఎందుకంటే మీలో ఆలోచిస్తున్నది మీరు కాదు, వందల ఏళ్ల క్రితం నాటి మూస పద్ధతులు. మీ పెదవులు మీవి కావు, ఈజిప్షియన్ మమ్మీల (Mummies) పెదవులు లాంటివి. ఆ మమ్మీలు ఎప్పుడో చచ్చిపోయాయి, కేవలం శరీరాన్ని మాత్రమే కాపాడి ఉంచారు. మీ పరిస్థితి కూడా అంతే. మీలో ప్రాణం లేదు, కేవలం పాత నమ్మకాలను మోస్తున్న ఒక శవం మీరు.
మీరు ఇతరుల అభిప్రాయాల పైన, పాత పద్ధతుల పైన ఆధారపడి బతుకుతున్నంత కాలం, అసలు మీకు అస్తిత్వం లేదు. ఆధారపడేవాడికి ఉనికి శూన్యం. ఇది అద్వైతం. ఇది కేవలం వేదాంతం కాదు, ఇది కఠోరమైన వాస్తవం. మీరు సజీవంగా ఉన్నారా? లేదా కేవలం వాడుకోవడానికి పనికొస్తున్నారా?

యవ్వనం అంటే వయసు కాదు. యవ్వనం అంటే మారగలిగే సామర్థ్యం. కొత్తదనాన్ని సృష్టించగలిగే ధైర్యం.
ఒక చెట్టుకి ఉన్న పచ్చని, లేత కొమ్మను తీసుకోండి. అది సజీవంగా ఉంది కాబట్టి వంగుతుంది. అది ఒక స్థిరమైన ఆకారాన్ని పట్టుకుని వేలాడదు. దానికి ఇష్టం వచ్చినట్లుగా అది తన దారిని మార్చుకోగలదు. అదే యవ్వనం!

ఇప్పుడు మీ ముందు ఉన్న ఈ బల్ల వైపు చూడండి. ఇది ఎప్పుడో చచ్చిపోయిన చెక్క. ఇది ఎంతో ఉపయోగకరం (Useful). దీని మీద మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పెట్టొచ్చు. ఇది ఎదురు తిరిగి మిమ్మల్ని ప్రశ్నించదు. "నన్ను ఇక్కడే ఎందుకు పెట్టావు?" అని అడగదు.
ఇప్పుడు సమాజానికి, మీ తల్లిదండ్రులకు, మీకు కావాల్సింది ఏమిటి?
భారతదేశంలో మనం "ఉపయోగపడే" వాళ్ళను చాలా గౌరవిస్తాం. ముఖ్యంగా ఆడవాళ్ళను 'త్యాగానికి ప్రతిరూపాలు' అని పూజిస్తాం. ఎందుకంటే వాళ్ళకంటూ స్వంత జీవితం ఉండదు, బ్యాంకు అకౌంట్ కూడా ఉండదు. వాళ్ళ జీవితం మొగుడికి, పిల్లలకి, అత్తమామలకి ఉపయోగపడుతుంది. దానికి బదులుగా వాళ్ళని దేవతలు అంటాం. ఎంత మోసం? ఎంత దారుణమైన లాజిక్?

మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి:
మీరు సజీవంగా ఉండాలనుకుంటున్నారా, లేదా ఒక బల్ల లాగా ఇతరులకు ఉపయోగపడే వస్తువులా పడి ఉండాలనుకుంటున్నారా?
"Placement" మరియు "Settled" - రెండు దరిద్రమైన పదాలు
కాలేజీల్లో మేనేజ్‌మెంట్లు, తల్లిదండ్రులు ఎంత సంబరపడిపోతుంటారో చూస్తుంటాం. "మా పిల్లాడికి Placement వచ్చింది! మా అమ్మాయి లైఫ్ లో Settled!" అని స్వీట్లు పంచుకుంటారు.

అసలు ఈ పదాల అర్థం ఎప్పుడైనా గమనించారా?
ఈ చెక్క బల్లకి ప్రాణం లేదు కాబట్టి దాన్ని ఒక చోట పెట్టొచ్చు. ప్రాణం లేనివి మాత్రమే సెటిల్ అవుతాయి. ఒక చోట ఈ బల్లను పెడితే, వంద ఏళ్లైనా అక్కడే, అలాగే ఉంటుంది. అది పూర్తిగా Settled! కానీ ఒక మనిషి, నరనరాల్లో రక్తం ప్రవహిస్తున్న ఒక యువకుడు, "నేను సెటిల్ అయిపోయాను" అంటే దాని అర్థం ఏంటి? నాలో ఎదుగుదల ఆగిపోయింది, నాలో ప్రశ్నించే తత్వం చచ్చిపోయింది, నేను ఒక యంత్రం లాగా మారిపోయాను అని కదా! మరి మీకు ఏది కావాలి? చెక్కలాగా సెటిల్ అవ్వాలా? లేదా సజీవంగా ఉండాలా?

మీకు ప్రాణంతో ఉండటం కావాలంటే, ఎప్పటికీ సెటిల్ అవ్వకండి!
ముందు ఏమి చేయాలి? భవిష్యత్తు గురించి అడగకండి!
హోళీ పండుగ రోజు మీ ముఖం నిండా రంగులు, బురద, పెయింట్ పూసుకుని నా దగ్గరికి వచ్చి, "సార్, ఈ ముఖం పైన నేను ఏ బట్టలు వేసుకోవాలి?" అని అడిగితే నేను ఏం చెప్తాను? "ముందు వెళ్లి నీ ముఖం కడుక్కోరా బాబు! ఆ మురికిని వదిలించుకో, అప్పుడు కొత్త ఆలోచన అదే వస్తుంది" అని చెప్తాను.

మీరు ఇప్పుడు అదే అడుగుతున్నారు. మీ బుర్ర నిండా మీడియా, Algorithms, సమాజం, తల్లిదండ్రులు వేసిన మురికి పేరుకుపోయి ఉంది. ఈ చెత్త అంతా బుర్రలో పెట్టుకుని, "నేను ఏ దారి ఎంచుకోవాలి? నా భవిష్యత్తు ఏమిటి?" అని అడగడం ఒక జోక్.
ఒక ఖైదీ, జైలు నాలుగు గోడల మధ్య కూర్చుని ఆకాశం ఎలా ఉంటుందో వర్ణించమని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మీరు భవిష్యత్తు గురించి అడిగే ప్రశ్నలు కూడా అంతే హాస్యాస్పదం. మీకు కావాల్సింది ఆకాశం గురించిన ఊహలు కాదు, జైలు గోడలను బద్దలు కొట్టే స్వేచ్ఛ!
సృష్టి జరగాలంటే విధ్వంసం తప్పనిసరి.

నిలదీయండి. ప్రతి దాన్ని ప్రశ్నించండి.
మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ ప్రశ్నలు విని ఉలిక్కిపడవచ్చు, వివాదాలు రావచ్చు, బంధాలు తెగిపోవచ్చు. భయపడకండి!
పాతది నాశనం అయితేనే కొత్తది మొలకెత్తుతుంది. ఆ బానిసత్వపు గొలుసులను బద్దలు కొట్టండి. గతాన్ని వదిలించుకోండి, మీ స్లేట్ ను ముందు ఖాళీ చేయండి. అప్పుడు ఏ భవిష్యత్తు కోసం మీరు దేవులాడాల్సిన అవసరం లేదు. ఆ భవిష్యత్తు దానంతట అదే, మీ ఊహకు కూడా అందనంత అద్భుతంగా, స్వచ్ఛంగా ఆవిష్కృతమవుతుంది. కళ్ళు తెరవండి, వాస్తవాన్ని ఎదుర్కోండి!

-Surya Dilip
x

Comments

Popular Posts