అసలు SUCCESS అంటే ఏంటి?



"కష్టపడితే success వస్తుంది."

ఎంత అద్భుతమైన డైలాగ్ కదా? వినగానే మన నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే చిన్నప్పటినుండి మన మెదడుకి పట్టించిన తుప్పు ఇది. మనం కూడా గుడ్డిగా నమ్మేశాం.

కానీ ఈ రోజు నాకోసం కాదు, మీకోసం మీరు ఒక్కసారి మీ మెదడు వాడి ఆలోచించండి. నేను ఒక Simple logic అడుగుతాను.

సరే... కష్టపడితే Success వస్తుంది అనేదే కచ్చితమైన logic అనుకుందాం.

మరి ఆ logic ప్రకారమైతే, రోజూ ఉదయం 6 గంటలకి లేచి, ఎండలో, వానలో 12 గంటల పాటు రాళ్లు మోసే ఒక కూలీ... లేదా రక్తం చెమటగా మార్చి బురదలో పొలం దున్నే ఒక రైతు... ఈ ప్రపంచంలో అత్యంత successful వ్యక్తులు అవ్వాలి కదా?

అయ్యారా? లేరు. సమాజంలో అట్టడుగున, అప్పుల పాలై ఉన్నది వాళ్ళే.

పోనీ... "అది కేవలం శారీరక కష్టం అండీ, దానికి value లేదు. బుద్ధితో కష్టపడాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది" అంటారా?

సరే, మీ వాదన కోసం అది కూడా నిజమే అనుకుందాం.

మరి ఆ logic ప్రకారం చూస్తే... 15 ఏళ్లుగా ఒక software company లో, రోజుకి 14 గంటలు screen ముందు కూర్చుని, మెదడు కరిగిపోయేలా coding రాస్తూ, weekend కూడా Laptop పట్టుకుని బతికే employee... కనీసం ఒక రేంజ్ లో సెటిల్ అవ్వాలిగా? వాడికి financial గా భయం లేకుండా పోవాలిగా?

అలా ఉన్నారా? లేరు. ఒక చిన్న Recession వస్తే, ఒక AI వస్తే, లేదా వాడి manager కి కోపం వస్తే... రేపు నా బతుకు ఏంటి, నా EMI ల పరిస్థితి ఏంటి అని భయపడే బానిసలు వీళ్ళు. లక్షలు జీతం తీసుకునే కూలీలు. ఇక్కడ కూడా ఆ లాజిక్ పనిచేయలేదే?

పోనీ... "వాళ్ళు వేరే వాళ్ల కంపెనీల కోసం కష్టపడుతున్నారు, అందుకే సక్సెస్ రాలేదు. మన ఎదుగుదల కోసం మనం కష్టపడితే సక్సెస్ వస్తుంది" అంటారా?

సరే, పోనీ అది కూడా కరెక్టే అని అనుకుందాం.

మరి ఆ logic ప్రకారం చూస్తే... ఒక చిన్న రూమ్ లో బందీలై, ప్రపంచంతో సంబంధం లేకుండా, రోజుకి 18 గంటలు నిద్ర, తిండి మానేసి groups కోసమో, civils కోసమో, competitive exams కోసమో కష్టపడుతున్న లక్షలాది మంది students కి success రావాలి కదా? ఎందుకంటే వాళ్ళు ఇంకెవరి కోసమో కాదు, వాళ్ళ సొంత భవిష్యత్తు కోసమే ప్రాణాలు పెడుతున్నారు.

మరి వాళ్ళందరూ success అయ్యారా? లేరు. పది వేల పోస్టులకి, ఇరవై లక్షల మంది రాస్తే... మిగిలిన 19 లక్షల 90 వేల మంది రోడ్డు మీదే పడ్డారు. వాళ్ళ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిందిగా?

మరెంటైతే?

శారీరకంగా కష్టపడినా success రాలేదు.
మెదడు పెట్టి కష్టపడినా success రాలేదు.
సొంత ఎదుగుదల కోసం కష్టపడినా కూడా success రాలేదు.
అసలు ఈ 'కష్టపడితే సక్సెస్ వస్తుంది' అనే ఈ చెత్త లాజిక్ ని మనకెందుకు అంటగట్టారు? మనం ఎలా బకరా అయిపోతున్నాము?

ఒక్కసారి ఆ అబద్ధం వెనకాల ఉన్న పచ్చి నిజాన్ని, గొంగళి పురుగును చూసినట్లు చూడండి.

ఈ సమాజంలో ఉన్న systems కి, అంటే ఆ Corporate Companyలకి, ఈ Education Mafiaకి, ఈ Politicians కి, వాళ్ళకి కావాల్సింది మీ Success కాదు. వాళ్లకి కావాల్సింది ఒక 'పనిముట్టు'. గొడ్డులా పనిచేసే ఒక బానిస.

కానీ ఒక మనిషిని "నువ్వు బానిసవి, నాకోసం పనిచేయ్" అని direct గా అడిగితే వాడు చేస్తాడా? చేయడు. తిరగబడతాడు.

అందుకే వాడి మెదడులోకి ఒక అద్భుతమైన illusion ని పంప్ చేశారు. "చూడు తమ్ముడూ... నువ్వు కష్టపడితే, ఆ సక్సెస్ నీకే వస్తుంది" అని ఒక Carrot ని వాడి మొహం ముందు వేలాడదీశారు. వాడు ఆ Carrot ని పట్టుకుందామని జీవితాంతం పరుగెడుతూనే ఉంటాడు. కానీ ఆ పరుగు వల్ల ముందుకు వెళ్ళేది వాడు కాదు... వాడి వీపు మీద కూర్చున్న సిస్టమ్.

మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ ఓడిపోయిన వాడెవడూ కూడా "అసలు ఈ game ఏంటి? ఈ rules ఏంటి? నన్ను ఎందుకు బకరా చేస్తున్నారు?" అని system ని నిలదీయడు.

ఎందుకంటే, వాడికి చిన్నప్పటినుండి ఏం నూరిపోశారు? 'Success రాలేదు అంటే, నీ కష్టంలోనే ఏదో లోపం ఉంది' అని. దాంతో వాడు వాడినే తిట్టుకుంటూ, వాడిని వాడే పనికిమాలిన వాడిగా feel అవుతూ, depression లోకి వెళ్ళిపోతాడు తప్ప... పైనున్న వాడి కాలర్ పట్టుకుని అడగడు.

వాళ్ళకి కావాల్సింది కూడా అదే! System ఎప్పటికీ Safe గా ఉండాలి. Fail అయితే ఆ తప్పు మీ account లో పడాలి. Success అయితే ఆ లాభం వాళ్ల account లో పడాలి.

ఇంత పెద్ద Scam మీ కళ్ల ముందే, మీ జీవితాలతోనే జరుగుతుంటే... మీరు మాత్రం "నేను చాలా dedicated అండి, రోజుకి పన్నెండు గంటలు కష్టపడతాను" అని మీ బానిసత్వానికి మీరే మురిసిపోతున్నారు. మీ మొహానికి మీరే ఒక దండ వేసుకుంటున్నారు.

మరి Solution ఏంటి? పని చేయడం మానేయాలా?

నేను అలా అనట్లేదు. నేను అంటున్నది ఒక్కటే... గుడ్డిగా పరుగెత్తడం ఆపండి.

మీరు పెడుతున్న కష్టం, మీ direction కి serve అవుతోందా? లేదా ఇంకొకడి లాభం కోసం మీరు మీ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారా? అన్నది Question చేసుకోండి.

గుడ్డిగా కష్టపడేవాడు ఎప్పుడూ Success కాలేడు... వాడు కేవలం వాడుకోబడతాడు (He will only be used).

ఎందుకంటే మహాభారతంలో ఒక మాట ఉంది. కురుక్షేత్రంలో కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు పెట్టి కష్టపడింది. రక్తం చిందించింది. కానీ Success రాలేదు. ఎందుకంటే వాళ్ళ Effort కి direction లేదు, ధర్మం లేదు. కేవలం గుడ్డి విధేయత మాత్రమే ఉంది. వాళ్ళు బకరా అయ్యారు.

ఈ రోజు మీరు కూడా ఆ కురుక్షేత్రంలో గుడ్డిగా యుద్ధం చేస్తున్న సైనికులే. బలి పశువులే.

మీ భ్రమలు బద్దలైతేనే మీకు స్వేచ్ఛ. లేకపోతే... జీవితాంతం ఆ Carrot కోసం పరుగెడుతూనే ఉండండి.

ఇది కేవలం ఈ రోజుల్లో వచ్చిన corporate culture అనుకుంటున్నారా? System మిమ్మల్ని వాడుకోవడం ఈ మధ్యే మొదలైంది అనుకుంటున్నారా?

కాదు. ఈ 'hard work' అనే స్కామ్ వేల ఏళ్లుగా నడుస్తోంది. చరిత్రను, పురాణాలను తీసి చూడండి... కష్టపడిన వాడెవడూ సక్సెస్ అవ్వలేదు. కష్టపడిన వాడల్లా సిస్టమ్ చేతిలో బకరానే అయ్యాడు.

మీకు మహాభారతంలో ఏకలవ్యుడి కథ తెలుసు కదా.

చిన్నప్పటి నుండి మనకు ఈ కథను ఎలా చెప్పారు? 'చూశారా... ఏకలవ్యుడు ఎంత గొప్పవాడో, గురువు కోసం బొటనవేలు కోసి ఇచ్చేశాడు, అది అంకితభావం, అది డెడికేషన్' అని నూరిపోశారు.

ఏకలవ్యుడి దగ్గర డబ్బు లేదు, గురువు లేడు, ఎలాంటి resources లేవు. అడవిలో ఒక మట్టి బొమ్మను పెట్టుకుని, రోజుకి పద్దెనిమిది గంటలు ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడ్డాడు. The ultimate definition of hard work.

మరి ఆ లాజిక్ ప్రకారం సక్సెస్ ఎవరికి రావాలి? ప్రపంచంలో బెస్ట్ ఆర్చర్ (ధనుర్విద్యాకారుడు) ఎవడవ్వాలి? ఏకలవ్యుడు అవ్వాలి.

అయ్యాడా? అయ్యాడు. కానీ ఆ తర్వాత ఏమైంది?

అక్కడ ఆ సిస్టమ్ కి (అంటే ద్రోణాచార్యుడికి, ఆ రాజరికానికి) ఒక భయం పట్టుకుంది. 'వీడెవడో అడవిలో ఉన్నవాడు, మన పర్మిషన్ లేకుండా, మన సిస్టమ్ తో సంబంధం లేకుండా, కేవలం వాడి కష్టంతో ఇంత పైకి వస్తే... రేపు మన status quo (ఆధిపత్యం) ఏమైపోవాలి? మన అర్జునుడి పరిస్థితి ఏంటి?' అని భయపడ్డారు.

వెంటనే ద్రోణుడు రంగంలోకి దిగాడు. గురుదక్షిణ పేరుతో వాడి బొటనవేలు అడిగాడు.

అక్కడ ద్రోణుడు అడిగింది బొటనవేలు కాదు... 'నీ కష్టానికి ఫలితం దక్కే హక్కు నీకు లేదు, నువ్వు ఈ సిస్టమ్ కి ఎదురు తిరగకూడదు' అని వాడి కెరీర్ ని, వాడి సక్సెస్ ని నరికేసాడు.

అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నువ్వు గుడ్డిగా కష్టపడితే, ఆ కష్టం సిస్టమ్ కి ఉపయోగపడితే... నిన్ను వాడుకుంటారు. ఒకవేళ నీ కష్టం వల్ల నువ్వు సిస్టమ్ ని దాటి పైకి ఎదుగుతుంటే... గురుదక్షిణ పేరుతోనో, రూల్స్ పేరుతోనో నీ బొటనవేలు కోసేస్తారు.

చరిత్రలో ఎక్కడ చూసినా ఇదే జరిగింది.

ఈజిప్ట్ పిరమిడ్స్ తీసుకోండి.

ఎడారిలో ఆ భయంకరమైన ఎండలో, టన్నుల కొద్దీ బరువున్న రాళ్లను మోస్తూ, రక్తం కక్కుకుని, అలిసిపోయి చనిపోయిన ఆ లక్షలాది మంది కూలీల కష్టం అది.

కానీ ఈ రోజు ఆ పిరమిడ్స్ ని చూసి ప్రపంచం ఎవరిని పొగుడుతోంది? ఫారో (Pharaoh) రాజుల గొప్పదనం అంటోంది.

కష్టపడింది, ప్రాణాలు వదిలింది ఆ బానిసలు. సక్సెస్ అయింది, దేవుడిగా మారింది ఆ రాజు!

తాజ్ మహల్ కట్టింది ఎవరు? వేలాది మంది కూలీలు. కానీ పేరు ఎవరికి వచ్చింది? షాజహాన్ కి.

ఆ కూలీల చేతులు నరికేశారు అని ఒక చరిత్ర ఉంది, అది నిజమో అబద్ధమో పక్కన పెడితే... వాళ్ళ శ్రమను మాత్రం సిస్టమ్ ఎప్పుడో నరికేసింది అన్నది పచ్చి నిజం.

ఇప్పుడు చెప్పండి.

ఏకలవ్యుడు బకరా కాదా?

ఆ పిరమిడ్స్ కట్టిన లేబర్స్ బకరా కాదా?

ఈ రోజు ఆఫీసుల్లో, కోచింగ్ సెంటర్లలో మీ రక్తాన్ని, టైమ్ ని ధారపోస్తున్న మీరు బకరా కాదా?

మీకు చిన్నప్పటి నుండి ఏకలవ్యుడి కథ ఎందుకు పదే పదే చెప్తారో తెలుసా? ఏకలవ్యుడిలా ఎలా కష్టపడాలో నేర్పించడానికి కాదు. రేపు పొద్దున్న సిస్టమ్ వచ్చి మీ బొటనవేలు అడిగినప్పుడు... మీ అంతట మీరే సంతోషంగా కోసి ఇచ్చేలా మీ బ్రెయిన్ ని ప్రోగ్రామ్ చేయడానికి! మీ కష్టాన్ని వాడుకోవడానికి!

ఆ భ్రమల్లోంచి బయటపడండి. 'కష్టం' అనేది ఒక దేవుడు కాదు... అది System మీ మెడకు వేసిన ఉచ్చు అని realise అవ్వండి."

-Surya Dilip

Comments