అసలు నిజమైన ప్రేమంటే ఏంటి?



నిజమైన ప్రేమ ఒక జోలపాట కాదు, అది ఒక యుద్ధభేరి.

నేను ఒకడిని చూసి, “నువ్వెందుకు ఇంత సాధారణంగా మిగిలిపోయావు?” అని అడిగానంటే, దానర్థం వాడిని అవమానించడం కాదు. వాడిని మేల్కొల్పడం. ఎందుకంటే, అత్యున్నత శిఖరాలను చేరుకున్న ఏ మహానుభావుడికైనా ఎలాంటి సామర్థ్యం (Potential) ఉందో, అదే సామర్థ్యం నీలో కూడా దాగి ఉందని నాకు తెలుసు. మరి నీ సామర్థ్యాన్ని నువ్వెందుకు వాడుకోవడం లేదు? ఏ రోజు వరకు అయితే నువ్వు నీ అసలు స్థాయికి చేరుకోలేవో, ఆ రోజు వరకు నేను నిన్ను అంగీకరించను. ఇదే నిజమైన ప్రేమ.

బేషరతు ప్రేమ (Unconditional Love): మీ బద్ధకానికి మీరు పెట్టుకున్న అందమైన పేరు

షరతులు (Conditions) లేని ప్రేమ చాలా చవకబారుది. నిజం చెప్పాలంటే అది ప్రేమే కాదు, పబ్లిక్ పార్కులో ఉన్న కుర్చీ. ఎవడు పడితే వాడు వచ్చి కూర్చుంటాడు. ప్రేమకు ఖచ్చితమైన షరతులు ఉండాలి.

ఒక ఫంక్షన్ హాల్‌లో వేసే ప్లాస్టిక్ కుర్చీకి, సింహాసనానికి చాలా తేడా ఉంటుంది. సింహాసనం ఒక కండిషన్ పెడుతుంది: “నా మీద కేవలం రాజు మాత్రమే కూర్చోవాలి” అని. కానీ రైల్వే ప్లాట్‌ఫారమ్ మీద ఉండే కుర్చీకి ఎలాంటి కండిషన్స్ ఉండవు, ఎవడొచ్చినా కూర్చోవచ్చు. కండిషన్స్ పెట్టకపోతే, నీ జీవితంలోకి రాజు (ఉన్నతమైన వ్యక్తిత్వం) ఎప్పటికీ రాడు. రాజుకి సింహాసనమే కావాలి, ప్లాట్‌ఫారమ్ కుర్చీ కాదు. ఎవడైతే కండిషన్స్ పెట్టుకోడో, వాడి జీవితం ఒక జనరల్ కంపార్ట్‌మెంట్ లాగా తయారవుతుంది, రోడ్డు మీద పోయే ప్రతివాడూ వచ్చి కూర్చుంటాడు.

కండిషన్ పెట్టడం అంటే ఎదుటివాడిని తక్కువ చేయడం కాదు. “నువ్వు ఏ స్థాయికి వెళ్లగలవో, ఇప్పుడు దానికంటే చాలా దిగువన బతుకుతున్నావు. నువ్వు ఎదగాలి, అందుకే నేను ఈ కండిషన్ పెడుతున్నాను” అని చెప్పడం.

అసలు ఈ Unconditional Acceptance అనే కాన్సెప్ట్ వెనుక మన అంతులేని స్వార్థం దాగి ఉంది. ఎదుటివాడిని క్వశ్చన్ చేస్తే వాడు రేపు మనల్ని క్వశ్చన్ చేస్తాడు. “నువ్వు మారవద్దు, నేను మారను. నువ్వు ఆ బురదలో పొర్లు, నేను ఈ బురదలో పొర్లుతాను. ఇద్దరం ఒకరినొకరు Unconditionally Accept చేద్దాం.” ఇది ప్రేమ కాదు, ఇది ఒక కాంప్రమైజ్!
ప్రేమ ఒక సవాలు, నిద్రపుచ్చే లోరీ కాదు

నిజమైన ప్రేమ ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది, ఒక లలకార్ (సవాలు) లాగా ఉంటుంది. కానీ మనం కోరుకునే ప్రేమ ఒక నకిలీ జోలపాట (Lullaby). మనకు ఆ జోలపాట ఎంత నచ్చిందంటే, మెలకువగా ఉన్నవాడిని కూడా అది మత్తుగా పడుకోబెడుతుంది. “అబ్బా, ఎంత తియ్యటి పాట” అని మురిసిపోతూ మనల్ని మనం మోసం చేసుకుంటాం.

ప్రేమ అంటే నిద్రపోయే వాడిని తట్టి లేపేది. ఏ సవాలు విసిరితే వాడు ఉలిక్కిపడి లేస్తాడో, అదే ప్రేమ. కానీ అలాంటి ప్రేమ ఎవరికి కావాలి? మనం సుఖంగా పడుకుంటే, వచ్చి నిద్రలేపితే ఎవరికైనా చిరాకే వస్తుంది. అందుకే మనకు జోలపాడే వాళ్లే కావాలి. "నువ్వు పాడు, నేను పడుకుంటాను, నా భ్రమల ప్రపంచంలో నేను బతుకుతాను."
పోరాటాన్ని దాచేసి, విగ్రహాలను పూజిస్తున్న సమాజం

మీరు ఎప్పుడైనా గమనించారా? సిక్కుల దుకాణాల్లో గురునానక్ గారి చిత్రపటం కచ్చితంగా ఉంటుంది. అందులో ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న చేయి చాలా సున్నితంగా, పసిపిల్లవాడి చేతిలాగా కనిపిస్తుంది. కానీ చరిత్ర ఏం చెబుతోంది? గురునానక్ గారు జీవితాంతం కాలినడకన ఎన్నో కఠినమైన యాత్రలు చేశారు. యాత్రల నుండి తిరిగి వచ్చాక ఆయన స్వయంగా వ్యవసాయం చేశారు. ఒక రైతు చేతులు ఎంత కరుకుగా, గట్టిగా ఉంటాయో మీకు తెలుసా?

మరి ఆ వాస్తవాన్ని మనం ఎందుకు చూపించం? ఆయన చేతులు ఎంత కఠినంగా ఉంటాయో, ఆయన జీవితం ఎంత పోరాటంతో కూడుకున్నదో మనం చూపిస్తే, ఆ పోరాటాన్ని మనం కూడా చేయాల్సి వస్తుందేమో అన్న భయం మనది. అందుకే దేవుళ్లను కూడా మన కంఫర్ట్ జోన్‌లోకి లాగేసుకుని, వారిని అత్యంత కోమలంగా మార్చేశాం.
రాముడు, సీత, మరియు 14 ఏళ్ల అడవి జీవితం

ఈ రోజు రాముడు, సీతమ్మల పాత చిత్రాలు లేదా విగ్రహాలు చూడండి. వాళ్లు ఎంత కళకళలాడుతూ, స్వచ్ఛంగా కనిపిస్తారంటే, 14 సంవత్సరాలు అడవిలో గడిపిన వాళ్లలాగా అస్సలు ఉండరు. 14 ఏళ్లు అడవిలో ఉంటే చర్మం ఎలా అవుతుంది? శరీరం ఎంత కరుకుగా మారుతుంది? ముఖం మీద ఎన్ని గాయాలు, మచ్చలు (Scars) పడి ఉంటాయి? అవేవీ మనకు కనిపించవు.

వాళ్ళ బట్టలు చూడండి, ఇప్పుడే ఏదో ఏసీ మాల్ నుండి కొనుక్కొని వేసుకున్నట్లుగా ఉంటాయి. అడవిలో భయంకరమైన పరిస్థితుల్లో తిరిగే వాళ్ల బట్టలు అలా ఉంటాయా? ఎప్పుడైనా ఆ వాస్తవాన్ని చూపించారా? లేదు.

ఎందుకంటే, ఆధ్యాత్మికత (Spirituality) అంటేనే రక్తం చిందించే పోరాటం (Struggle) అని మనకు తెలియనివ్వరు. ఒకవేళ సీతమ్మ ఎంత భయంకరమైన పోరాటం చేసిందో నిజంగా చూపిస్తే, ఈ రోజు సమాజంలో ఉన్న మహిళల్లో కూడా అదే పోరాట పటిమ రగులుకుంటుంది. కానీ మనకు కేవలం ఆవిడ నిలబడి ఆశీర్వాదం ఇచ్చే సున్నితమైన బొమ్మను మాత్రమే చూపిస్తారు. రావణుడు సీతను చూసి భయపడ్డాడు అంటే దానికి కారణం ఆమె చూపించిన గడ్డిపోచ కాదు. 14 ఏళ్లు అడవిలో వనవాసం చేసిన ఒక స్త్రీ కళ్లలో ఎంత భయంకరమైన 'తేజస్సు' ఉంటుందో, దాని ముందు రావణుడు వణికిపోయాడు. ఆ తేజస్సును, ఆ రౌద్రాన్ని ఎప్పుడైనా చిత్రాల్లో చూపించారా?
కండలు తిరిగిన కృష్ణుడు, గాయపడిన అర్జునుడు

గూగుల్ లో “Shri Krishna Arjun” అని ఇమేజెస్ సెర్చ్ చేయండి. అర్జునుడి చేతులు ఎంత మృదువుగా ఉంటాయంటే, జీవితంలో ఒక పూల కుండీ కంటే బరువైన వస్తువు ఎత్తని వాడిలా ఉంటాడు. అలాంటి చేతులతో అంతటి శక్తివంతమైన గాండీవం ఎలా పట్టుకుంటాడు? కృష్ణుడు అర్జునుడిని పదే పదే “మహాబాహో!” (బలమైన చేతులు కలవాడా) అని పిలుస్తాడు. కానీ మన విగ్రహాలలో ఆ మహాబాహువులు ఏవి?

మన వాస్తవం ఏంటంటే, ఈ మహాకార్యాలన్నీ అసాధారణమైన శారీరక, మానసిక బలం ఉన్నవాళ్లు చేశారు అన్న నిజాన్ని మనం జీర్ణించుకోలేం. అలా ఒప్పుకుంటే, మన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి దారి ఉండదు. అందుకే దేవుళ్ళంతా ఏదో మ్యాజిక్ చేసి గెలిచారు అని మనం నమ్ముతాం.
పడుకున్న బుద్ధుడు, ఏడుస్తున్న కబీరు: శాంతి అనే వ్యాపారం

బుద్ధుడు దాదాపు 12 ఏళ్లు కఠోర తపస్సు చేశాడు, శరీరం ఎముకల గూడులా మారేంత వరకూ పోరాడాడు. కానీ మీకు ఎప్పుడూ ఏం చూపిస్తారు? ఆయన ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నట్లు, లేదా కళ్ళు మూసుకుని పడుకున్నట్లు (Reclining Buddha). ఆయన జీవితంలో విశ్రాంతి తీసుకోవడానికి ఎప్పుడు సమయం దొరికిందని? కానీ జీవితాంతం మంచం మీద పడుకుని కాలం గడిపే వాళ్లకు, బుద్ధుడు కూడా పడుకుని ఉంటేనే చూడాలనిపిస్తుంది.

ఎప్పుడైనా బుద్ధుడి పోరాటాన్ని, ఆయన ముఖంలో ఉన్న తపనను (Agony) చూపించారా? లేదు. "ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు" అనే ఒక నకిలీ ఇమేజ్ క్రియేట్ చేశారు. అసలు ఊరికే ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది? లోపల నరకం అనుభవించాలి, ఎముకలు విరగాలి, రక్తమాంసాలు కరగాలి, నిన్ను నువ్వు పూర్తిగా ముక్కలు చేసుకోవాలి. అప్పుడు వస్తుంది స్థిరత్వం!

ఇది తెలియక, ఈ రోజు చాలామంది నకిలీ బాబాలు ప్రశాంతంగా కళ్లు మూసుకుని కూర్చుంటే చాలు, తాము బుద్ధులం అయిపోయాం అనుకుంటున్నారు. కళ్లు మూసుకుని ఒక ఐదు గంటలు కదలకుండా కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది కండరాలు ఎలా పట్టేస్తాయో (Cramps). నరాలు ఎలా లాగుతాయో. ఆ బాధ భరించలేక కదలాల్సి వస్తుంది. కాసేపు Lotus pose (పద్మాసనం) వేసి కూర్చుంటే వాస్తవం ఏంటో ఆ నొప్పులే చెబుతాయి. కానీ ఆ వాస్తవాన్ని ఎవరూ బయటపెట్టరు.

నిజం (Truth) ఎప్పుడూ కఠినంగా, గరుకుగా (Rough) ఉంటుంది. ఆ గరుకుదనానికి మన సున్నితమైన చర్మం గీసుకుపోతుంది. అందుకే నిజాన్ని చాలా సాఫ్ట్ చేసి మనకు అమ్ముతున్నారు.

కబీరు దాసు ఏమన్నారో తెలుసా? "సబ్ జగ్ జల్తా దేఖ్ కే హువా కబీర్ ఉదాస్" (ఈ ప్రపంచం కాలిపోవడం చూసి కబీర్ ఉదాసుడయ్యాడు) మరియు "దియా కబీరా రోయే" (కబీర్ ఏడ్చాడు). ఆయన ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాడు. కానీ ఏ చిత్రంలోనైనా కబీర్ ఏడుస్తున్నట్లు చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే ఆయన ఏడుపు, మన పనికిమాలిన నకిలీ ఆనందం చెంప మీద కొట్టినట్లు ఉంటుంది. ఒక మహాత్ముడు పక్కన ఏడుస్తుంటే, నువ్వు పిచ్చివాడిలా ఎలా నవ్వగలవు? నీకు ఆ నిజం తట్టుకునే దమ్ము లేదు.

వాళ్ళు ఏదో దేవుళ్ళు, వాళ్ళ దగ్గర మ్యాజిక్ శక్తులు (Divine powers) ఉన్నాయి, ఒక్క సెకన్‌లో కళ్లు తెరిచి రాక్షసుల్ని భస్మం చేసేశారు అని చెప్పడం మనం నేర్చుకున్న అబద్ధం. ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే అని, వాళ్ళు రక్తం చిందించి పోరాడారు అని ఒప్పుకుంటే, నువ్వు కూడా రేపటి నుండి కష్టపడాల్సి వస్తుంది. నీ బద్ధకాన్ని దాచుకోవడానికే వాళ్ళను దేవుళ్లను చేశావు!

జ్ఞానుల, ఋషుల బాధతో మూలుగుతున్న ముఖాలు మనకు కావాలి. నెత్తురోడుతున్న వాళ్ళ చేతులు మనం చూడాలి. అన్నీ నాశనమైపోతున్నా, లోపల విరిగిపోకుండా నిలబెట్టే ఆ శక్తేదో మనం తెలుసుకోవాలి. దాని పేరే ఆత్మ! దాని పేరే నిజమైన అధ్యాత్మికత!

జోలపాటలు వినడం ఆపండి. సవాలును స్వీకరించండి

-Surya Dilip

Comments