మృత్యువును మర్చిపోయావా? అయితే నువ్వు బ్రతికి ఉన్నట్టే కాదు! (The Logic of Fear)
ఒక్క నిమిషం ఆగు. ఈ ఆర్టికల్ చదవడం మొదలుపెట్టే ముందు నీకు నువ్వు ఒక నిజం ఒప్పుకో. నువ్వు భయపడుతున్నావు. అవునా?
రేపు ఏం జరుగుతుందో అని భయం, ఉన్న ఉద్యోగం పోతుందేమో అని భయం, నువ్వు రాత్రింబవళ్లు ఒంటరిగా కష్టపడి నిర్మిస్తున్న నీ సామ్రాజ్యం (నీ కెరీర్, నీ ఛానెల్, నీ ఆస్తులు) ఎక్కడ కుప్పకూలిపోతుందో అని భయం. నీకు కావాల్సిన వాళ్ళు దూరమవుతారేమో అని భయం. అసలు ఈ బ్రతుకుకి అర్థం ఉందో లేదో అన్న భయం.
సమాజం, మోటివేషనల్ స్పీకర్లు నీకు ఏం చెప్తున్నారు? "భయపడకు! Be fearless! భయాన్ని జయించు!" అని. కానీ నేను ఒక పచ్చి నిజం చెప్తున్నాను విను: ఈ సృష్టిలో భయం చెప్పేంత పచ్చి నిజం ఇంకేదీ చెప్పదు.
భయం ఎప్పుడూ అబద్ధం ఆడదు. అబద్ధం ఆడుతోంది నువ్వు, నీ అహంకారం (Ego). భయం నీ దగ్గరికి వచ్చి ఒకటే చెప్తోంది: "ఒరేయ్ పిచ్చోడా, నువ్వు శాశ్వతం అనుకుంటున్న ఈ వస్తువులు, ఈ మనుషులు, ఈ పదవులు ఏవీ శాశ్వతం కాదు, రేపు ఇవన్నీ నాశనం అయిపోతాయి" అని.
ఇందులో అబద్ధం ఎక్కడుంది? లాజికల్ గా ఆలోచించు.
1. The Mathematical Certainty of Destruction (నాశనం అనేది ఒక గణిత సత్యం)
నీకు దేనినైతే కోల్పోతానేమో అన్న భయం ఉందో, అది ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా పోతుంది. నువ్వు నాకు ఈ భూమి మీద, పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నాశనం కానిది, కాలగర్భంలో కలిసిపోనిది ఒక్కటంటే ఒక్కటి చూపించు?
నువ్వు వేసుకున్న గొప్ప plans ఏంటి? పదేళ్ల క్రితం వేసుకున్న plans ఇప్పుడు ఉన్నాయా? పోయాయి.
ఎన్నో సంస్కృతులు, మతాలు పుట్టాయి, మట్టిలో కలిసిపోయాయి.
మనిషి సృష్టించిన భౌతిక వస్తువులే కాదు, మనిషి మెదడులో పుట్టిన 'ఆలోచన' కూడా శాశ్వతం కాదు.
కొంచెం బుర్రపెట్టి విశాలంగా ఆలోచించు. కేవలం ఈ భూమి గురించి, నీ చిన్న జీవితం గురించి మాత్రమే కాదు. విశ్వం (Universe) వైపు చూడు. మనం ఇక్కడ కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో, అంతరిక్షంలో ఎన్నో మహా పెద్ద Galaxies (నక్షత్రమండలాలు) పేలిపోయి కనుమరుగైపోతున్నాయి.
మనం రోజూ చూసి దండం పెట్టుకునే ఆ సూర్యుడు ఉన్నాడు చూశావా? ఆ సూర్యుడు కేవలం ఒక 'Medium-sized star' మాత్రమే. దానికి కూడా ఒక Expiry date ఉంది. కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత ఆ సూర్యుడు కూడా మండి, పేలిపోయి, బూడిదైపోతాడు.
సూర్యుడికే గ్యారెంటీ లేనప్పుడు, నువ్వు ఏడొక మూల కూర్చుని, ఒక screen ముందు మొహం పెట్టి, "నాకు ఇన్ని Views రాలేదే, నా subscribers తగ్గిపోయారే, నా break-up అయిపోయిందే" అని ఏడుస్తున్నావు చూశావా? నీ ఏడుపు ఎంత హాస్యాస్పదంగా ఉందో నీకు అర్థం అవుతోందా?
మనం పూజించే దేవుళ్ళ పరిస్థితి చూడు. వేద కాలంలో గాలి దేవుడు, నీరు దేవుడు. ఈరోజు ఆ దేవుళ్ళను ఎవరైనా పట్టించుకుంటున్నారా? మనిషి మనసులోంచి ఆ దేవుళ్ళే చెరిగిపోయారు. దేవుళ్ళకే అస్తిత్వం లేకుండా పోయినప్పుడు, నీ భవిష్యత్తు మీద నీకెందుకు అంత Over confidence?
2. సగం నిజం చెప్పే భయం - The Incomplete Truth
నీకు భయం ఎందుకు వేస్తోందంటే, భయం నీకు వాస్తవాన్ని చూపిస్తోంది. అద్దం ముందు నిలబడితే జుట్టు ఊడిపోవడం కనిపిస్తోంది. "అరెరె, నిన్నటి దాకా నా తల మీద ఉన్న జుట్టుకే దిక్కు లేదు, ఇక ఈ తల లోపల ఉన్న నా అహంకారానికి, నేను సంపాదించిన డబ్బుకి ఎంత కాలం దిక్కు ఉంటుంది?" అని భయం నిన్ను ప్రశ్నిస్తోంది.
మరి భయం కరెక్టే చెప్తున్నప్పుడు మన సమస్య ఎక్కడ వస్తోంది?
సమస్య ఏంటంటే, భయం 99% నిజం చెప్తుంది. కానీ ఒక 1% దాచేస్తుంది. ఆ సగం నిజమే నిన్ను చంపేస్తోంది. భయం ఏమంటుంది? "రేపు ఇదంతా నాశనం అయిపోతుంది, కాబట్టి ఏడుస్తూ కూర్చో" అంటుంది.
కానీ ఇక్కడే మనం మన విశ్లేషణాత్మక బుద్ధిని (Analytical logic) వాడాలి. వాక్యం ఇంకా పూర్తి కాలేదు. పూర్తి వాక్యం ఏంటంటే: "రేపు ఇదంతా నాశనం అయిపోతుంది, కాబట్టే అది నాశనం అయ్యే లోపే దాన్ని పూర్తిగా, అత్యున్నత స్థాయిలో జీవించు."
ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు మార్కెట్ కి వెళ్లి ఒక ఖరీదైన పండ్ల రసం కొనుక్కొచ్చావు. దాని మీద స్పష్టంగా "Expiry date: 3 Days" అని రాసి ఉంది. మూడు రోజుల తర్వాత అది పాడైపోతుందని, దాన్ని పారబోయాలని నీకు ముందే తెలుసు.
మరి నువ్వు ఏం చేస్తావు? "అయ్యో మూడు రోజుల తర్వాత ఇది పాడైపోతుందే" అని దాని ముందు కూర్చుని ఏడుస్తావా? లేక, పాడైపోయే లోపు దాన్ని తాగి, నీ శరీరానికి శక్తిని ఇస్తావా?
నీ జీవితం కూడా అంతే! నీ యవ్వనం, నీ టాలెంట్, నీ సమయం - వీటన్నింటికీ ఒక Expiry date ఉంది. ఇవన్నీ ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే (నాళీలో పారబోసినట్టు). కానీ, అవి నాశనం అయ్యేలోపు, వాటిని నీ 'చైతన్యం' (Consciousness) పెంచుకోవడానికి వాడుకోవాలి. దేనినైతే నువ్వు కోల్పోతావో, అది కోల్పోయే లోపే దాని నుండి గ్రహించాల్సిన జ్ఞానాన్ని లాగేయాలి.
3. టైమ్ బాంబ్ లాంటి గుండె (The Ticking Time Bomb)
చాలా మంది ముసలివాళ్ళు అయిపోయాక, చావు దగ్గర పడుతుంటే అప్పుడు ఆలోచిస్తారు, "అరెరె, నా జీవితం అంతా వ్యర్థం అయిపోయిందే, ఒక బంజరు భూమిలా మిగిలిపోయిందే" అని. కానీ వయసులో ఉన్నవాళ్లు ఏమనుకుంటారంటే, చావు అనేది ఎవరికో ముసలివాళ్లకు వచ్చే జబ్బు అని.
ఒక లాజికల్ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు: ప్రతి మనిషీ పుట్టేటప్పుడే తన ఛాతీలో ఒక Time bomb పెట్టుకుని పుడతాడు. మీరు దాన్ని ముద్దుగా 'గుండె' (Heart) అని పిలుచుకుంటారు. గుండె ఏం చేస్తుంది? 'లబ్-డబ్, లబ్-డబ్' అని కొట్టుకుంటుంది. టైమ్ బాంబ్ ఏం చేస్తుంది? 'టిక్-టిక్, టిక్-టిక్' అని కొట్టుకుంటుంది.
ఆ టైమ్ బాంబ్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం గ్యారెంటీ: అది ఖచ్చితంగా పేలుతుంది. ఇంత పెద్ద నిజం నీ ఛాతీలోనే రోజుకు లక్ష సార్లు చప్పుడు చేస్తుంటే, నువ్వు ఎక్కడికో వెళ్లి "నాకు Peace of mind కావాలి, నా future secure గా ఉండాలి" అని వెతుకుతున్నావు. ఎంత పెద్ద వెర్రితనం ఇది?
4. దుఃఖానికి కూడా ఒక పరిమితి ఉంది (The Limit of Suffering)
నువ్వు ఎప్పుడైనా గమనించావా? మనం పడే బాధలు కూడా చాలా చవకబారువి. "అబ్బా, నేను చాలా depression లో ఉన్నాను, నా లైఫ్ నాశనం అయిపోయింది" అని నీకు నువ్వు కబుర్లు చెప్పుకుంటావు.
నువ్వు బాధపడదాం అన్నా కూడా, నీకు ఎన్ని రోజులు బాధపడే అర్హత ఉందో తెలుసా? మహా అయితే ఒక 30 ఏళ్ళు, లేదా 40 ఏళ్ళు. అంతే! ఆ తర్వాత నువ్వు, నీ బాధలు అన్నీ మట్టిలో కలిసిపోవాల్సిందే. నీ దుఃఖానికి వెయ్యేళ్ల ఆయుష్షు లేదు.
అన్నీ నాశనం అయిపోవడానికి క్యూలో నిలబడి ఉన్నప్పుడు, ఈ ఒక్క క్షణాన్ని దేనికో భయపడి ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? రేపు అనేది ఉంటుందో లేదో నీకు తెలియదు. నిన్న అనేది వెళ్ళిపోయింది. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ 'క్షణమే' (The Present Moment).
మరి ఈ క్షణాన్ని భయంతో గడుపుతావా? లేక పీల్చి పిప్పి చేసి, మత్తుగా (Awareness తో కూడిన మత్తు) జీవిస్తావా?
5. సత్యమైన మత్తు vs భయంతో కూడిన మత్తు
మత్తు రెండు రకాలు:
భయం వల్ల వచ్చే మత్తు: భయాన్ని తట్టుకోలేక, దాన్ని మర్చిపోవడానికి మందు తాగడమో, లేదా Social Media లో గంటల తరబడి scroll చేస్తూ escape అవ్వడమో చేయడం. ఇది పిరికివాడి లక్షణం.
నిజం తెలిసినవాడి మత్తు (The Socratic Joy): వీడికి తెలుసు రేపు అన్నీ నాశనం అయిపోతాయని. "నా కెరీర్, నా పరువు, నా శరీరం అన్నీ బూడిదే" అని వాడికి స్పష్టంగా తెలుసు. భయం వాడి పక్కనే కూర్చుని ఉంటుంది. అయినా సరే వాడు నవ్వుతాడు.
సమాజం వాడిని అడుగుతుంది: "రేపు అన్నీ పోతాయి కదా, ఎందుకురా అంత ఆనందంగా ఉన్నావు?" అని. వాడు చెప్తాడు: "రేపు అన్నీ పోతాయి అని నాకు స్పష్టంగా తెలుసు కాబట్టే, ఈ క్షణంలో నాకు దేని గురించీ భయం లేదు, ఏ బాధ్యతా లేదు. అందుకే నేను ఆనందంగా ఉన్నాను."
మృత్యువును ఎవరైతే అడుగడుగునా గుర్తుంచుకుంటారో, వారి కంటే స్వేచ్ఛగా బ్రతికేవాడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు.
6. ఏడుస్తున్న అహంకారం - The Fake "Alpha"
కొంతమంది పనికిమాలిన Ego తో తిరుగుతుంటారు. "నేను మగాడిని, నాకు భయం లేదు, నేను దేనికీ భయపడను" అని డైలాగులు కొడతారు. ఇది అత్యంత అపరిపక్వమైన (Immature) బుద్ధి. భయపడని వాడు ధైర్యవంతుడు కాదు, వాడు ఒక మూర్ఖుడు.
జ్ఞానులు, కబీర్ లాంటి వాళ్ళు ఏమన్నారో తెలుసా?
సరిగ్గా విను. ఎవరైతే తమ నిజమైన భయాలను అంగీకరిస్తారో, వాళ్ళకే ఆ భయం ఒక దారి చూపిస్తుంది. నువ్వు ఒక అబద్ధపు ప్రపంచంలో ఉంటూ, దేనికో భయపడుతూ, బాధపడుతూ కూర్చున్నావు అనుకో. అప్పుడు 'చావు' (Death/End of things) అనే ఆలోచన నీకు ఒక మిత్రుడిలా రావాలి.
వచ్చి నీతో ఇలా అనాలి: "ఒరేయ్, నువ్వు ఇప్పుడు పడుతున్న ఈ టెన్షన్, ఈ ఏడుపు, రేపటి వరకూ ఉంటాయా? అసలు దాన్ని అనుభవించడానికి రేపు నువ్వు బ్రతికి ఉంటావా? లేనప్పుడు దేనికిరా నీ ఏడుపు?"
చావుని మర్చిపోయి మజా చేయమని నేను చెప్పట్లేదు. ఆ మజా fake. చావుని నిరంతరం గుర్తు పెట్టుకో... అప్పుడు వచ్చే మజా ఉంది చూశావా, అది అసలైనది.
భయాన్ని నీ దగ్గరికి పిలువు. "రా భయ్యా, కూర్చో! ఇంకా ఏమేమి నాశనం అవుతాయో చెప్పు. ఏమేమి నా నుండి లాగేసుకుంటావో చెప్పు. నువ్వు నాకు ఎన్ని వస్తువులు మాయమైపోతాయని చెప్తే, నేను అంతగా ఈ క్షణంలో స్వేచ్ఛ పొందుతాను. నేను కోల్పోవడానికి ఏమీ లేదని తెలిశాక, నన్ను భయపెట్టడం నీ అయ్య తరం కూడా కాదు!" అని చెప్పు.
ఇప్పుడు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నువ్వు రోజువారీగా చేస్తున్న పనులు, పడుతున్న టెన్షన్స్... ఇవన్నీ నీ చావు (లేదా నీ ఐడెంటిటీ నాశనం అవ్వడం) ముందు ఏమైనా విలువైనవేనా? కాకపోతే, ఆ చెత్తను ఇప్పుడే వదిలేయ్. నిజాన్ని చూడు. మేల్కో.
-Surya Dilip
.jpg)

.jpg)
Comments
Post a Comment